అగ్గువకే ఇసుక..క్యూబిక్ మీటర్ రూ. 40.. యాదాద్రిలో కొత్తగా 9 రీచ్లు గుర్తింపు

అగ్గువకే ఇసుక..క్యూబిక్ మీటర్ రూ. 40.. యాదాద్రిలో కొత్తగా 9 రీచ్లు గుర్తింపు
  • 92 వేల క్యూబిక్​ మీటర్ల ఇసుక ఉన్నట్టు అంచనా
  • రూ. 773కే ట్రాక్టర్​ ఇసుక..  ఇందిరమ్మ ఇండ్లకు రూ. 212

యాదాద్రి, వెలుగు :  అధికారికంగా ఇసుకను అగ్గువకే అందించడానికి యాదాద్రి జిల్లా శాండ్​ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేట్లు కూడా నిర్ణయించింది. ఈ రేట్లు కేవలం ఇసుక వరకే పరిమితం చేస్తూ లోడింగ్​, ట్రాన్స్​పోర్ట్​కు సంబంధించిన ఇసుక తీసుకునే వారికే వదిలి పెట్టింది.

 9 ఇసుక రీచ్​లు .. 

యాదాద్రి జిల్లాలో మూసీ ప్రవాహం ఉన్నా.. ఎక్కువగా హైదరాబాద్​ నుంచి మురుగు నీరే ఇందులో ప్రవహిస్తోంది. జిల్లాలో ఎక్కడికక్కడ చిన్నా, పెద్ద వాగులు ఉన్నాయి. వీటిలో ఆలేరు వాగు, బిక్కేరు వాగు, మూసీ వాగు లాంటివి ఉన్నాయి. వీటి నుంచి టాక్టర్ల కోద్దీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కాగా ఇప్పటివరకూ  ప్రత్యేకంగా ఇసుక రీచ్​లు లేవు.

జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతుండడంతో  ఇసుకకు డిమాండ్​ పెరిగింది. దీంతో రేట్లు పెంచేశారు. ఈ క్రమంలోనే జిల్లా శాండ్​ కమిటీ కొత్తగా 9 ఇసుక రీచ్​లను గుర్తించింది. ఈ వారంలో మరో మూడు రీచ్​లను గుర్తించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గుండాల, అడ్డగూడూరు, మోటకొండూరు, మోత్కూరు మండలాల పరిధిలోని 9 ఇసుక రీచ్​లో 92 వేల క్యూబిక్​ మీటర్ల(సీబీఎం) ఇసుక ఉన్నట్టుగా గుర్తించారు.  గుండాల మండలం అనంతారంలో 17,100 సీబీఎం, అడ్డూగూడూరులోని చిర్రగూడూరులో 19,830, వెల్దేవిలో  21,945, లక్ష్మిదేవి కాల్వ, ధర్మారంలో 1600 చొప్పున, డీ రేపాకలో 3,830, అజీమ్​పేటలో 20,990, మోటకొండూరు మండలం తేర్యాలలో 2,505, మోత్కూరు మండలం దాచారంలో 2,576 క్యూబిక్​ మీటర్ల ఇసుక ఉందని గుర్తించారు. 

ఇందిరమ్మ ఇల్లుకు  రూ. 212

ఇందిరమ్మ ఇండ్లు పేదలకే కేటాయించినందున ఇసుకను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ ట్రాక్టర్​ ఇసుక రూ. 3 వేల నుంచి ఆపై మొత్తం వసూలు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న రేట్లను పరిశీలించిన యాదాద్రి జిల్లా శాండ్​ కమిటీ వాటి కంటే తక్కువ ధరకు అందించాలని భావిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న అంఛనాల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఒక ట్రాక్టర్​ ఇసుకును రూ. 212 కే అందించనుంది.

సేనరేజ్​ చార్జీ కూడా మినహాయించడంతో తక్కువ రేటుకు అందనుంది.  ప్రభుత్వ భవనాలు, ఇతర ఇండ్లకు సీనరేజ్​ చార్జీ కలుపుకొని రూ. 773 అవుతోంది. మన ఇసుక వాహనం స్కీమ్​ కింద బుకింగ్​  చేసుకున్న వారే లోడింగ్​, ట్రాన్స్​పోర్ట్ భరించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రేట్లను కూడా మరింత తగ్గించే అవకాశాన్ని జిల్లా  శాండ్​ కమిటీ పరిశీలిస్తోంది. 

క్యూబిక్​ మీటర్​కు రూ. 40


ఇప్పటికే సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాల్లో స్థానిక అవసరాల కోసం ‘మన ఇసుక వాహనం’ పేరుతో తక్కువ ధరకు ఇసుకను అందిస్తున్నారు. ఆయా జిల్లాల్లో సీనరేజ్​ చార్జీ కింద క్యూబిక్​ మీటర్​ ఇసుకను రూ. 40కి అందిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్​లో మూడు క్యూబిక్​ మీటర్ల ఇసుక లోడ్​ చేసుకునే అవకాశం ఉంది.